సమీక్ష : “వాల్తేరు వీరయ్య” – ఇంట్రెస్ట్ గా సాగే కామెడీ యాక్షన్ డ్రామా!

Waltair Veerayya Movie-Review-In-Telugu

విడుదల తేదీ : జనవరి 13, 2023

123తెలుగు.కామ్ రేటింగ్ : 3.25/5

నటీనటులు: చిరంజీవి, రవితేజ, శృతి హాసన్, క్యాథరిన్, ప్రకాష్ రాజ్, ప్రదీప్ రావత్, సత్యరాజ్, బాబీ సింహా, జాన్ విజయ్, నాసర్, శ్రీనివాస రెడ్డి, వెన్నెల కిషోర్, సప్తగిరి, షకలక శంకర్ త‌దిత‌రులు

దర్శకుడు : కేఎస్ రవీంద్ర (బాబీ కొల్లి)

నిర్మాతలు: నవీన్ యెర్నేని, రవిశంకర్

సంగీత దర్శకులు: దేవి శ్రీ ప్రసాద్

సినిమాటోగ్రఫీ: ఆర్థర్ ఎ విల్సన్

ఎడిటర్: నిరంజన్ దేవరమానే

సంబంధిత లింక్స్: ట్రైలర్

 

మెగాస్టార్ చిరంజీవి – రవితేజ కలయికలో శృతి హాసన్ హీరోయిన్ గా నటించిన సినిమా వాల్తేరు వీరయ్య. కాగా ఈ చిత్రం ఈ రోజు రిలీజ్ అయింది. మరి ప్రేక్షకులును ఈ సినిమా ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !

 

కథ :

 

వాల్తేరు వీరయ్య (చిరంజీవి) ఓ కేసు కోసం ఫైట్ చేస్తూ ఉంటాడు. ఈ క్రమంలో ఆ కేసుకు సంబంధించిన సాక్షిని ప్రవేశ పెట్టాలి. దాని కోసం కేసును వాయిదా వేయించడానికి వీరయ్య పాతిక లక్షలు లంచం ఇవ్వాల్సి వస్తోంది. ఆ డబ్బు కోసం వీరయ్య ఓ పని ఒప్పుకుంటాడు. ఇంతకీ ఏమిటీ ఆ పని ?, అసలు వీరయ్య ఏ కేసు కోసం ఫైట్ చేస్తున్నాడు ?, ఈ మధ్యలో అతిధి (శ్రుతి హాసన్) ట్రాక్ ఏమిటి ?, అసలు వీరయ్య గతం ఏమిటి?, వాల్తేరు వీరయ్య (చిరంజీవి)కి విక్రమ్ సాగర్ (రవితేజ) సవతి తల్లి కొడుకు. పరిస్థుతులు కారణంగా ఇద్దరు చిన్నతనంలోనే దూరం అవుతారు. వైజాగ్ లో వీరయ్య తన గ్యాంగ్ తో మందు బాటిల్స్, ఎలక్ట్రానిక్ వస్తువులు స్మగ్లింగ్ చేస్తూ ఉంటాడు. అక్కడకి ఎసీపీగా వచ్చిన విక్రమ్ సాగర్ వీరయ్యను ఎలా అడ్డుకున్నాడు?, ఈ క్రమంలో వీరయ్యకే తెలియకుండా జరిగిన పొరపాటు ఏమిటి ? అనేది మిగిలిన కథ.

 

ప్లస్ పాయింట్స్ :

 

భారీ అంచనాలతో వచ్చిన వాల్తేరు వీరయ్య, ఆ అంచనాలకు తగ్గట్టుగానే.. హై ఓల్టేజ్ యాక్షన్ డ్రామాతో మరియు మెగా ఎంటర్ టైన్మెంట్ తో అలాగే గ్రాండ్ విజువల్స్ తో ఆకట్టుకుంది. సినిమాలో మెగాస్టార్ చిరంజీవి కామెడీ టైమింగ్ తో పాటు కథలోని మెయిన్ ఎమోషన్ కూడా బాగుంది. అలాగే మెగాస్టార్ పాత్రలోని షేడ్స్ ను, శ్రుతి హాసన్ తో సాగే సీన్స్ ను, అలాగే ప్లాష్ బ్యాక్ ను.. ఆ ప్లాష్ బ్యాక్ లోని రవితేజ క్యారెక్టర్ తో పాటు యాక్షన్ సీక్వెన్సెస్ ను.. ఇలా ప్రతి పాత్రను, ప్రతి ట్రాక్ ను దర్శకుడు బాబీ చాలా బాగా తీర్చిదిద్దారు.

ముఖ్యంగా రవితేజ పాత్రలోని ఎలివేషన్ సన్నివేశాలు విశేషంగా అలరిస్తాయి. ఇక వీరయ్య పాత్రకు చిరంజీవి ప్రాణం పోశారు. రఫ్ అండ్ మాస్ అవతార్‌ లో మెగాస్టార్ అద్భుతంగా నటించారు. చిరు – శ్రుతి హాసన్ ఆన్‌ స్క్రీన్ కెమిస్ట్రీ కూడా చాలా బాగుంది. మరో పవర్ ఫుల్ క్యారెక్టర్ లో రవితేజ కూడా చాలా బాగా నటించాడు. ఊర్వశి రౌతేలా చేసిన స్పెషల్ సాంగ్ థియేటర్స్ లో విజిల్స్ వేయించింది. కీలక పాత్రలో నటించిన ప్రకాష్ రాజ్ పెర్ఫార్మెన్స్ చాలా సెటిల్డ్‌ గా చాలా బాగుంది.

క్యాథరిన్ నటన కూడా బాగుంది. అలాగే మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. బాబీ దర్శకత్వం ఆకట్టుకుంది. కథలోని ప్రధాన పాత్రల పై బాబీ పెట్టిన ఎఫెక్ట్స్ బాగున్నాయి.

 

మైనస్ పాయింట్స్ :

 

వీరయ్య – రవితేజ పాత్రలు, కథా నేపథ్యం, అలాగే ఇతర పాత్రల చిత్రీకరణ, నటీనటుల పనితీరు బాగున్నా.. కథనం విషయంలో బాబీ చాలా స్లోగా ప్లే నడిపాడు. అయితే, పాత్రల మధ్య ఎమోషన్స్ ను బాగా ఎస్టాబ్లిష్ చేసినా… కొన్ని చోట్ల మెలో డ్రామాలా అనిపిస్తోంది. దీనికి తోడు పాత్రలు ఎక్కువ అవ్వడం, అలాగే అక్కడక్కడా కామెడీ కోసం పెట్టిన అమవసరమైన డిస్కషన్ సినిమా స్థాయికి తగ్గట్టు లేదు.

ఇక సెకండాఫ్ లో కూడా కొన్ని చోట్ల ప్లే స్లోగా సాగింది. ప్రధానంగా కొన్ని సన్నివేశాల్లో గ్రిప్పింగ్ నరేషన్ మిస్ అయింది. దీనికితోడు కొన్ని సన్నివేశాలు కూడా రొటీన్ గానే సాగాయి. ప్రకాష్ రాజ్ ట్రాక్ పూర్తి సినిమాటిక్ గా సాగింది. విలన్ – హీరో మధ్య కాన్ ఫ్లిక్ట్ కూడా ఇంకా బలంగా ఉండాల్సింది.

 

సాంకేతిక విభాగం :

 

సాంకేతిక విభాగానికి వస్తే.. దేవి శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం ఆకట్టుకుంది. దేవి అందించిన నేపథ్య సంగీతం సినిమాకు ఆయువుపట్టుగా నిలిచింది. సినిమాటోగ్రఫీ వర్క్ చాలా బాగుంది. ఎంతో రియలిస్టిక్ గా, గ్రాండ్ విజువల్స్ తో ప్రతి సీన్ ను చాలా బ్యూటిఫుల్ గా చూపించారు. ఎడిటర్ సినిమాలోని స్లో సీన్స్ ను తగ్గించి ఉంటే.. సినిమాకి బాగా ప్లస్ అయ్యేది. నిర్మాతలు నవీన్ ఎర్నేని, రవిశంకర్.వై ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నేషనల్ రేంజ్ లో భారీగా నిర్మించారు. నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. దర్శకుడిగా బాబీ బాగా ఆకట్టుకున్నాడు.

 

తీర్పు :

 

పూనకాలు లోడింగ్ అంటూ హై ఓల్టేజ్ యాక్షన్ అండ్ ఎమోషనల్ ఎంటర్ టైనర్ గా వచ్చిన వాల్తేరు వీరయ్య బాగా ఆకట్టుకున్నాడు. మెగా ఫ్యాన్స్ కి ఫుల్ కిక్ ను ఇచ్చింది ఈ సినిమా. అలాగే ఇంట్రస్ట్ గా సాగే మెగాస్టార్ – రవితేజ క్యారెక్టరైజేషన్స్ మరియు గ్రాండ్ యాక్షన్ విజువల్స్ అండ్ చిరు కామెడీ టైమింగ్, మెయిన్ సీక్వెన్సెస్ చాలా బాగున్నాయి. కాకపోతే కొన్ని సన్నివేశాలు స్లోగా సాగడం, సెకండ్ హాఫ్ పై ఆసక్తిని తారాస్థాయికి తీసుకువెళ్ళలేకపోవడం వంటి అంశాలు సినిమాకి మైనస్ అయ్యాయి. ఓవరాల్ గా ఈ సినిమా ఆడియన్స్ ను బాగా ఆకట్టుకుంది. మెగా ఫ్యాన్స్ కి ఫుల్ పూనకాలను ఇస్తోంది.

123telugu.com Rating: 3.25/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

Exit mobile version