సీఎం రేవంత్‌తో టాలీవుడ్ ప్రముఖుల భేటీ వివరాలు

సీఎం రేవంత్‌తో టాలీవుడ్ ప్రముఖుల భేటీ వివరాలు

Published on Dec 26, 2024 1:01 PM IST

తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డితో తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించిన పెద్దలు నేడు భేటీ అయ్యారు. సినీ పరిశ్రమ సమస్యలపై ఈ సందర్భంగా ప్రభుత్వంతో వారు చర్చలు జరుపుతున్నారు. ఈ భేటీ ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు నేతృత్వంలో జరుగుతోంది. ఈ భేటీకి సినిమా పరిశ్రమ నుంచి 36 మంది సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రభుత్వం దృష్టికి పలు సమస్యలతో పాటు సూచనలు తీసుకెళ్లారు.

ఇప్పటివరకు అందరు సీఎంలు ఇండస్ట్రీని బాగానే చూసుకున్నారని.. ఈ ప్రభుత్వం కూడా తమని బాగా చూసుకుంటోందని.. దిల్ రాజును FDC చైర్మన్‌గా నియమించడాన్ని స్వాగతిస్తున్నామని.. తెలంగాణలో అద్భుతమైన టూరిస్ట్‌ స్పాట్‌లు ఉన్నాయని.. గతంలో చంద్రబాబు చిల్డ్రన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ హైదరాబాద్‌లో చేశారని.. ఇప్పుడు కూడా ఇంటర్నేషనల్‌ ఫిల్మ్ ఫెస్టివల్‌ను హైదరాబాద్‌లో నిర్వహించాలని కోరుతున్నట్లు దర్శకుడు కె. రాఘవేంద్రరావు తెలిపారు.

హైదరాబాద్‌లో యూనివర్సల్‌ లెవెల్‌లో స్టూడియో సెటప్‌ ఉండాలని.. ప్రభుత్వం కేపిటల్ ఇన్సెంటివ్‌లు ఇస్తేనే సినీ పరిశ్రమ గ్లోబల్ స్థాయికి ఎదుగుతుందని.. హైదరాబాద్‌ వరల్డ్ సినిమా కేపిటల్ కావాలనేది తమ కోరిక అని హీరో నాగార్జున తెలిపారు. తాను చిన్నప్పటి నుంచి ఇండస్ట్రీని చూస్తున్నానని.. చిన్న చిన్న విషయాలను ప్రభుత్వం పట్టించుకోవద్దంటూ నిర్మాత శ్యాంప్రసాద్‌ రెడ్డి అన్నారు. హైదరాబాద్‌ను నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లాలని ఆయన ఈ సందర్భంగా తెలిపారు.

ఎలక్షన్‌ రిజల్ట్‌‌లాగే సినిమా రిలీజ్‌ ఫస్ట్‌డే ఉంటుందని.. సంధ్య థియేటర్ ఘటన తమని బాధించిందని.. సినిమా రిలీజ్‌లో కాంపిటిషన్ వల్లే ప్రమోషన్ కీలకంగా మారిందని.. ప్రపంచ వ్యాప్తంగా సినిమా రిలీజ్‌ ఉండడం వల్ల ప్రమోషన్‌ను విస్తృతంగా చేస్తున్నామని మురళీ మోహన్ పేర్కొన్నారు. ప్రభుత్వంపై తమకు నమ్మకం ఉందని.. హైదరాబాద్‌ను ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ డెస్టినేషన్‌ చేయాలనేది డ్రీమ్ అని.. ప్రభుత్వ సాయంతోనే ఆ రోజుల్లో చెన్నై నుంచి ఇండస్ట్రీ హైదరాబాద్‌కి వచ్చిందని.. నెట్‌ఫ్లిక్స్‌, అమెజాన్‌ సహా అన్ని ఏజెన్సీలకు హైదరాబాద్‌ కేరాఫ్‌గా ఉండాలని నిర్మాత సురేష్‌బాబు తెలిపారు. మాజీ సీఎం మర్రి చెన్నారెడ్డి, అక్కినేని నాగేశ్వర రావు వల్లే పరిశ్రమ హైదరాబాద్‌కి వచ్చిందని దర్శకుడు త్రివిక్రమ్‌ పేర్కొన్నారు.

ఇక సీఎం రేవంత్ రెడ్డి శాంతి భద్రతల విషయంలో రాజీ పడేది లేదని తెలిపారు. ఇకపై బౌన్సర్లపై సీరియస్‌గా ఉంటామన్న సీఎం, అభిమానుల్ని కంట్రోల్‌ చేసుకోవాల్సిన బాధ్యత సెలబ్రిటీలదే అని పేర్కొన్నారు. ప్రభుత్వం ఇండస్ట్రీకి అండగా ఉంటుందని భరోసా ఇచ్చిన సీఎం.. తెలంగాణ రైజింగ్‌లో ఇండస్ట్రీ సోషల్‌ రెస్పాన్స్‌బిలిటీతో ఉండాలని.. డ్రగ్స్‌ క్యాంపెయిన్‌, మహిళా భద్రత క్యాంపెయిన్‌లో చొరవ చూపాలని.. టెంపుల్‌ టూరిజం, ఎకో టూరిజంను ప్రమోట్ చేయాలని.. ఇన్వెస్ట్‌మెంట్ల విషయంలోనూ ఇండస్ట్రీ సహకరించాలని ఆయన కోరారు.

అయితే, ఇకపై బెనిఫిట్‌ షోలు ఉండవని ఇండస్ట్రీ పెద్దలకు తేల్చి చెప్పారు సీఎం రేవంత్‌. అసెంబ్లీలో తాము చెప్పిన మాటకు కట్టుబడి ఉన్నామని.. ప్రభుత్వం టాలీవుడ్‌కి పూర్తి మద్దతుగా ఉంటుందని సీఎం భరోసా ఇచ్చారు. సంధ్య థియేటర్‌ ఘటనపై ఆవేదన వ్యక్తం చేసిన సీఎం, ఒక మహిళ ప్రాణాలు కోల్పోవడం వల్ల తమ ప్రభుత్వం ఆ ఘటనను సీరియస్‌గా తీసుకుందని తెలిపారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు